హైదరాబాద్‌లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్‌చల్ చేశారు. షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి తమను బతకనీయకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాట వినకుంటే ఎమ్మెల్యే పదవి పోయినా అక్కడే కూర్చుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఏ విషయమైనా నోటీసు లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు.
సిటీలో హైడ్రా కూల్చివేతల విషయంలో ఎమ్మెల్యే దానం మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ పార్కు ఆక్రమణను తొలగించినప్పుడు నిరసన తెలిపిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగ విమర్శలు చేయొద్దని, ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించింది. అయితే కొంత కాలం సైలెంట్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతం మరోసారి హైడ్రాపై ఫైర్ అయ్యారు దానం నాగేందర్. తన నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అడుగు పెట్టాల్సిన అవసరంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.