తెలుగు రాష్ట్రాల్లో మద్యం కోసం అంతేసి ఖర్చు చేస్తున్నారా?
సంవత్సరానికి సగటున రూ. 1,623 ఖర్చు చేయడంతో, మద్యంపై తలసరి వ్యయం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
By అంజి Published on 28 Aug 2024 10:00 AM ISTతెలుగు రాష్ట్రాల్లో మద్యం కోసం అంతేసి ఖర్చు చేస్తున్నారా?
సంవత్సరానికి సగటున రూ. 1,623 ఖర్చు చేయడంతో, మద్యంపై తలసరి వ్యయం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రూ.1,306 సగటు వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP), న్యూఢిల్లీ తన వర్కింగ్ పేపర్, ``Revenue Mobilization from Taxes on Alcoholic Beverages’'లో ఈ డేటాను విడుదల చేసింది. భారతదేశంలో ఆల్కహాల్ వినియోగ విధానాలలో గుర్తించిన భౌగోళిక వ్యత్యాసాలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది.
డేటా ప్రకారం, తెలంగాణ మద్యం సంబంధిత వ్యయం 2014–15లో రూ.745 నుండి 2022–2023లో రూ.1,623కి పెరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఖర్చు రూ.365 నుంచి రూ.1,306కి పెరిగింది. 2022-23లో రూ. 4,860తో, సంవత్సరానికి రాష్ట్ర ఎక్సైజ్ వసూళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రూ.4,432తో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, రూ.2,788తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. కరోనా సమయంలో తెలంగాణలో అత్యధిక సగటు ఖర్చు నమోదైంది. 2020–21లో ఏకంగా రూ.1,719 తలసరి ఖర్చు వచ్చిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం ఖర్చులు బాగా తగ్గాయి. రూ. 1,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ:
అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త మద్యం పాలసీ పలు పాత బ్రాండ్లకు స్వస్తి పలకనుంది. రాష్ట్రంలో నాణ్యమైన బ్రాండ్‌లను అందుబాటులో ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం పాలసీలను అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో స్థానిక బ్రాండ్‌లను ప్రముఖ కంపెనీలతో భర్తీ చేయనుంది.
2014 నుండి 2019 వరకు తన పాలనలో, టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్ వ్యాపారంగా పరిగణించింది, దీంతో దేశవ్యాప్తంగా ఉండే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, 2019లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసిందని ఆరోపణలు ఉన్నాయి. YSRCP హయాంలో, రాష్ట్రంలో అనేక ప్రసిద్ధ విస్కీ, బీర్ బ్రాండ్లు అందుబాటులో లేవు. బ్లాక్ బస్టర్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, లెజెండ్, పవర్ స్టార్ 999, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ వంటి ఆసక్తికరమైన పేర్లతో కూడిన బ్రాండ్‌లను వైన్ షాపుల్లో అందుబాటులో ఉంచారు. వీటిని సోషల్ మీడియాలో జె-బ్రాండ్స్ (జగన్ బ్రాండ్స్) అని పిలుస్తారు. ఈ మద్యం బ్రాండ్‌లన్నీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలదేనని టీడీపీ, బీజేపీ పార్టీలు ఆరోపించాయి.