తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. గిరిజన పూజారులు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క-సారలమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువుదీరిన తర్వాత ఆ వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
అయితే జాతరలో సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ చాలా సవాలుతో కూడిన పనే చెప్పాలి. సమ్మక్క తల్లి చివరిసారిగా అదృశ్యమైన చిలకలగుట్టపైకి వెళ్లి గిరిజన పూజరి... అమ్మవారిని కుంకుమ భరిణె రూపంలో తీసుకువస్తుంటారు. సమ్మక్క తల్లి చిలకలగుట్ట కిందకు వచ్చే సమయంలో గౌరవసూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ సమయంలో అక్కడ ఉద్వేగభరిత వాతావరణం ఉంటుంది. ఇక మేడారం వనజాతరలో తొలిరోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు.