కంకరలో కూరుకుపోయి.. ఊపిరి ఆగి.. భయానకంగా చేవెళ్ల బస్సు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే ప్రధాన కారణమని తెలుస్తోంది.

By -  అంజి
Published on : 3 Nov 2025 10:02 AM IST

death toll, bus accident, Chevella, ​​Rangareddy district

కంకరలో కూరుకుపోయి.. ఊపిరి ఆగి.. భయానకంగా చేవెళ్ల బస్సు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే ప్రధాన కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్‌ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్టు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది చనిపోయారు.

మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. 10 నెలల పాప కూడా ఉంది. ఘటనా స్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది. బస్సులోని ప్రయాణికులపై కంకర పడటంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. అటు రెస్క్యూ చేపడుతుండగా చేవేళ్ల సీఐ శ్రీధర్‌ కాలిపై నుంచి జేసీబీ వెళ్లడంతో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన చేవేళ్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇవాళ తెల్లవారుజామున చేవేళ్ల మండలం మీర్జాగూడలో తాండూరు డిపో బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై కంకర ప్రయాణికులపై పడింది.

రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదిన కొనసాగించాలని, సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి గారు సీఎస్, డీజీపీతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్​లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని చెప్పారు.

Next Story