హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీన షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికి అవసరమైన ఎలక్షన్ ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల వ్యవధిలో ఎన్నికలు ముగించేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించినట్టు వెల్లడించింది.
వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. ఆయా నివేదికలను ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను త్వరలో డ్రా పద్ధతిలో నిర్ణయించారు.