హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు
By Knakam Karthik
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ), అసోసియేటేడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్(టీఎఫ్ఎంసీ) సంయుక్తంగా ఐటీ కారిడార్ లో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనపై సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాయి.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్ర క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ..ఐటీ కారిడార్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఐటీ కంపెనీలకు అద్దెకు బస్సులను ఇచ్చే సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తున్నామని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ప్రైవేట్ వాహనాల వినియోగం వల్ల ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవడం ఒక్కటే ట్రాఫిక్ నివారణకు ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ప్రతి ఐటీ సంస్థ కూడా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని, ఉద్యోగులకు ఆ దిశగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీ కారిడార్ లో అందిస్తోన్న రవాణా సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. ఐటీ కారిడార్ లో మెరుగైన రవాణా సేవల కోసం పలు ఐటీ సంస్థల ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వగా.. వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వారికి హామీ ఇచ్చారు.