పండుగ వేళ ఆర్టీసీ షాక్..స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంపు
రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది
By Knakam Karthik
పండుగ వేళ ఆర్టీసీ షాక్..స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంపు
రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ప్రయాణికులు లేకున్నా బస్సులను వెంటనే తిరిగి తీసుకురావాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీలు పెంచినట్లు వివరించారు. 11వ తేదీ తర్వాత వీటిలో ఛార్జీలు సాధారణంగానే ఉంటాయని తెలిపారు.
ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్బంగా సంస్థ సవరించింది.
కాగా రాఖీ పౌర్ణమికి ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ.. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది..అని టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలియజేసింది.