నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రూప్-3 సర్వీసులకు సంబంధించి ప్రొవిజనల్ ఎంపిక జాబితాను గురువారం విడుదల చేసింది. మొత్తం 1,388 పోస్టులకు గాను 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
2022లో 1388 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్-3 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించారు. అయితే గ్రూప్-1, 2 వివాదాలు, పలు కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది.
తాజాగా, ఈ ఏడాది మార్చి 14న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు కమిషన్ తెలిపింది. ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్లను అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలను చూసుకోవచ్చని టీజీపీఎస్సీ సూచించింది.