తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్, ఎస్ఎస్‌సీ బోర్డ్ అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని.. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించారు. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో 5.2 లక్షల మంది పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో గత నెల 24వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల1న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఈనెల 3న జరగాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటి నుంచి రాసి పంపించే అకాశాన్ని కల్పించింది. ఈనెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉత్కంఠ నెలకొనగా.. పరీక్షలను రద్దు చేసింది. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థులకు కరోనా ఉద్దృతి తగ్గాక పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇది వరకే ప్రకటించిన ప్రవేశ పరీక్షల తేదీలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.