బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు.. కామారెడ్డి జిల్లా అడ్లూర్‌లో ఉద్రిక్తత

Tension triggers in Adlur of Kamareddy amid bandh call given by farmers. ఇండస్ట్రియల్‌ జోన్‌ కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కారణంగా భూమిని కోల్పోతున్నాననే

By అంజి  Published on  5 Jan 2023 9:12 AM GMT
బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు.. కామారెడ్డి జిల్లా అడ్లూర్‌లో ఉద్రిక్తత

ఇండస్ట్రియల్‌ జోన్‌ కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కారణంగా భూమిని కోల్పోతున్నాననే బాధతో రైతు ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో రైతు ఆత్మహత్యకు నిరసనగా గురువారం కామారెడ్డి జిల్లా అడ్లూర్‌లో రైతులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు భారీ మార్చ్‌కు సిద్ధమయ్యారు. దీనికి బిజెపి పార్టీ మద్దతు ఇచ్చింది. మాస్టర్‌ప్లాన్‌లో తమ భూములు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది గ్రామాల రైతులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

కలెక్టరేట్‌ ముట్టడికి రైతులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొత్త మాస్టర్ ప్లాన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. కొత్త మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోకుంటే ఎమ్మెల్యేలను తమ గ్రామాలకు రాకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ లో భూమి పోవడంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రాములు ఆత్మహత్యతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే మాస్టర్ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో రాములు సూసైడ్ నోట్ ఈ గొడవను మరింత పెంచింది.

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు(42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చాపూర్‌లో 3 ఎకరాల సాగు భూమి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ముందుగా ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. కొత్త మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో తన భూమిని ఇండస్ట్రియల్ జోన్‌గా మార్చడంతో భూమిని విక్రయించడం జరగ లేదు. దీంతో మనస్తాపం చెందిన రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మాస్టర్‌ప్లాన్‌ బాధిత రైతులు మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి బల్దియా వద్ద నిరసనకు దిగారు.

కామారెడ్డి బస్టాండ్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. మృత దేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగారు రైతులు. అనంతరం కొత్త బస్టాండ్‌ వద్ద ఉన్న మృతదేహాన్ని అశోక్‌నగర్‌ కాలనీ, రైల్వేగేటు, పాత బస్టాండ్‌ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతదేహాన్ని పోలీసులు అనుమతి లేకుండా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ మృతుడి భార్య శారద నిరసన వ్యక్తం చేసింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె పెద్ద కుమారుడు అభినందు, చిన్న కుమారుడు నిశాంత్, బంధువులు నిరసన తెలిపారు.

Next Story