తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణతో ఒక వ్యక్తిపై దాడి చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చేసిన పనికి, అతడిని నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన వివిధ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయి. సమస్య సృష్టించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులను శాంతింపజేశారు.
ఈ ఘటనకు నిరసనగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గజ్వేల్‌లో కొన్ని సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానిక పోలీసులు ఈ ఘటనను చూసి మౌనంగా ఉన్నారని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) నాయకుడు అంజెదుల్లా ఖాన్ ఖలీద్ ఆరోపించారు. మైనారిటీ వర్గాలకు కూడా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, పోలీసు డైరెక్టర్ జనరల్, సిద్దిపేట కమిషనర్ విచారణకు ఆదేశించాలని కోరారు.