నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంబేడ్కర్ కూడలిలో శనివారం రాత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజ్‌పై రాళ్ల దాడి జరిగింది. దీంతో అతడిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపొలో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ దాడి ఘటనతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వల బాలరాజు తిరిగి వెళ్తుండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం మాటలు అనుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సమయంలోనే ఎమ్మెల్యే గువ్వలపై రాయితో దాడికి చేసినట్లు గువ్వల అనుచరులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరనన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణే స్వయంగా రాయితో కొట్టారని అంటున్నారు. ఓటమి భయంతోనే గువ్వల బాలరాజ్ పై కాంగ్రెస్ అభ్యర్థితో పాటు అనుచరులు దాడికి దిగారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతోందని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు.