హైదరాబాద్: నేటి నుంచి శుక్రమౌఢ్యం (మూఢం) ప్రారంభం అవుతుండటంతో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు వేసే వారిలో టెన్షన్ మొదలైంది. నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకు మూఢాలు ఉండడంతో నామినేషన్లు వేస్తే ఫలితం ఎలా ఉంటుందనే భయం ఆశావహుల్లో నెలకొంది. దీంతో మంచి రోజులు ఎప్పుడున్నాయో తెలుసుకునేందకు పంతుళ్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. కాగా రేపటి నుంచి సర్పంచ్ ఎన్నికల తొలి విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.
ఈ రోజు నుంచి మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడి దగ్గరికి వెళ్లడంతో వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. అయితే శుభ కార్యాలకు ఈ గ్రహాల బలం అవసరం. ఆ బలం తగ్గినప్పుడు శుభ కార్యాలు చేస్తే ఫలితం ఉండదని నమ్ముతారు.
మౌఢ్యమి శుభకార్యాలకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఈ 83 రోజుల్లో వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. 'నూతన వ్యాపార ప్రారంభం, పదవీ బాధ్యతలు స్వీకరించడం, ముఖ్యమైన, సుదూర ప్రయాణాలు, తీర్థయాత్రలు మానుకోవాలి. తొలిసారిగా భూమి పూజలు, బోర్ వేయడం చేయకూదు. పెళ్లి చూపులు, విగ్రహ ప్రతిష్ట, చెవులు కుట్టించడం వంటి శుభప్రదమైన పనులు కూడా మంచిది కాదు' అని పండితులు చెబుతున్నారు.