తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా 10 మంది న్యాయ‌మూర్తులు

Ten new judges appointed to Telangana High Court.తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా 10 మంది న్యాయ‌మూర్తులు రానున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 4:05 AM GMT
తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా 10 మంది న్యాయ‌మూర్తులు

తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా 10 మంది న్యాయ‌మూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం 12 మంది పేర్ల‌ను సిఫార్సు చేయ‌గా.. వారిలో 10 మంది నియామ‌కాల‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో న్యాయవాదుల కోటా నుంచి ఐదుగురు, న్యాయాధికారుల (జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌) కోటా నుంచి ఐదుగురు ఉన్నారు.

కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో న్యాయవాదుల నుంచి కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, ఎన్వీ శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు. న్యాయాధికారుల నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ దేవరాజ్‌ నాగార్జున్ ఉన్నారు. ఈ ప‌ది మంది న్యాయ‌మూర్తులు గురువారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ కుమార్‌ శర్మ వీరితో ప్ర‌మాణం చేయిస్తారు.

42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్ర‌స్తుతం 19 మంది ఉన్నారు. మంగ‌ళ‌వారం మ‌రో ప‌ది మంది నియామ‌కంతో మొత్తం సంఖ్య 29కి చేరింది. ఇంకా 13 ఖాళీలు ఉన్నాయి. కాగా.. హైకోర్టులో ఒకేసారి ప‌ది మంది న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించ‌డం ఇదే తొలిసారి.

Next Story