తెలుగు రాష్ట్రాల ఓటర్లు తుది జాబితా విడుదల.. ఏ రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?
Telugu States voters list released.తెలుగు రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది
By తోట వంశీ కుమార్
తెలుగు రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాల సవరణ తరువాత జనవరి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుండడం తెలిసిందే. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్లు గురువారం ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లకు చేరువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కోట్లకు దగ్గరైంది.
తెలంగాణలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కి చేరింది. ఇందులో 1,50,48,250 మంది పురుష ఓటర్లు ఉండగా, 1,49,24,718 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 1,951గా ఉంది. ఎన్ఆర్ఐ ఓటర్లు 2,740, సర్వీసు ఓటర్లు 15,282 మంది ఉన్నారు. ఇక మొదటి సారి ఓటు హక్కు పొందిన 18 ఏళ్ల నుంచి 19 మధ్య వయస్సు ఉన్న యువ ఓవర్లు 2,78,650 ఉన్నారు.
ఓటర్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 42,15,456 మంది ఓటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 31,08,068, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25,24,951 కి ఓటర్ల సంఖ్య చేరింది. ఇక అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072) కాగా.. అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813) నిలిచింది.
ఏపీలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868 గా ఉంది. ఇందులో 2,02,19,104 మంది మహిళా ఓటర్లు, 2,01,32,271 మంది పురుష ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3,924 గా ఉంది. 18 ఏళ్ల నుంచి 19 మధ్య వయస్సు ఉన్న యువ ఓవర్లు 3లక్షల మూడు వేల 225 మంది ఉన్నారు. ఇక 68,162 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19,42,233 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7.29,085 మంది ఓటర్లు ఉన్నారు.