వన్యప్రాణుల కోసం.. తెలంగాణలో తొలి ఓవర్‌పాస్ పర్యావరణ వంతెన

Telangana’s first overpass eco-bridge for wild animals coming up on NH-63. వన్యప్రాణుల సౌకర్యవంతమైన, సురక్షితమైన సంచారం కోసం తెలంగాణలో తొలి ఓవర్‌పాస్ పర్యావరణ

By అంజి  Published on  23 Nov 2022 5:00 AM GMT
వన్యప్రాణుల కోసం.. తెలంగాణలో తొలి ఓవర్‌పాస్ పర్యావరణ వంతెన

వన్యప్రాణుల సౌకర్యవంతమైన, సురక్షితమైన సంచారం కోసం తెలంగాణలో తొలి ఓవర్‌పాస్ పర్యావరణ వంతెనను నిర్మిస్తున్నారు. 63వ జాతీయ రహదారిపై మంచిర్యాల-చంద్రాపూర్ మార్గంలో ఈ వంతెన రాబోతోంది. ఇప్పటికే చాలా చోట్ల అటవీ ప్రాంతాలలో హైవేలపై ట్రాఫిక్ కారణంగా వన్యప్రాణుల సంచారానికి అంతరాయం కలగకుండా పర్యావరణ వంతెనలు నిర్మించబడ్డాయి. అయితే అటవీ ప్రాంతాల్లో నిర్మించిన సాంప్రదాయ అండర్‌పాస్‌ల మాదిరిగా కాకుండా.. ఇక్కడ ఓవర్‌ పాస్‌ వంతెనగా దీనిని నిర్మిస్తున్నారు.

వన్య జంతువులు ఈ బ్రిడ్జి మీదుగా హైవే దాటి వెళతాయి. వాహనాల రాకపోకలు వంతెన కింద నుంచి వెళతాయి. ఇది జంతువులు, ముఖ్యంగా పులుల సజావుగా వెళ్లడానికి సహాయపడుతుంది. వేగంగా వచ్చే వాహనాలు జంతువులను ఢీకొనకుండా ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాగజ్‌నగర్‌ అడవుల్లోని మంచిర్యాల - చంద్రాపూర్‌ మార్గం పర్యావరణ సున్నిత ప్రాంతం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వలస వచ్చే సమయంలో పులులు సాధారణంగా ఈ మార్గం గుండానే వెళతాయి.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 1 కి.మీ పొడవుతో ఓవర్‌పాస్ వంతెనను నిర్మిస్తోంది. రూ.30 కోట్లతో నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "పనుల వేగాన్ని బట్టి, దాదాపు ఆరు నెలల్లో వంతెన నిర్మాణం సిద్ధం అవుతుంది" అని అధికారి తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ సివిల్ పనులను చేపడుతుండగా, నిర్మాణ రూపకల్పన, స్థాన గుర్తింపు, పర్యావరణ అంశాలు, పనుల అమలులో అటవీ శాఖ సమన్వయం చేస్తోంది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. ఈ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. పనుల అమలులో అన్ని పర్యావరణ అనుకూల చర్యలను అనుసరిస్తున్నట్లు అధికారి తెలిపారు.

ఓవర్‌పాస్ వంతెనను నిర్మించడానికి గల కారణాలపై అధికారి మాట్లాడుతూ.. సాధారణంగా అడవి జంతువులు రాత్రి సమయంలో అండర్‌పాస్‌ల గుండా వెళ్లడానికి వెనుకాడతాయని చెప్పారు. ఇది తగినంత స్థలం లేకపోవటం లేదా వెలుతురు సరిగా లేకపోవడం లేదా కొన్నిసార్లు వర్షపునీటితో నిండిపోవడం వల్ల కావచ్చు. అయితే దీనికి విరుగుడుగా.. అడవి జంతువులు సౌకర్యవంతంగా, సురక్షితంగా రహదారిని దాటడానికి వీలుగా ఓవర్‌పాస్ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెనకు ఇరువైపులా చాలా పచ్చదనం ఉంటుంది. ఇది సాంప్రదాయ వంతెనలా కనిపించదని అధికారి తెలిపారు.

Next Story