కాళేశ్వరం లేకుండానే.. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం: సీఎం
ఖరీఫ్ సీజన్‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటి) దిగుబడిని నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు.
By అంజి Published on 18 Nov 2024 6:47 AM ISTకాళేశ్వరం లేకుండానే.. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం: సీఎం
హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటి) దిగుబడిని నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. రూ.1.4 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఉపయోగించకుండానే రాష్ట్ర రైతులు ఈ ఘనత సాధించారని, దీని ద్వారా కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి, నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా, ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా, కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని రేవంత్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత, వారి శ్రమ, చెమట, కష్టం ఫలితమని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం, ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో 52.51 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 96.31 ఎల్‌ఎంటి ఉత్పత్తి జరిగింది. ఇది 2021లో 62.14 లక్షల ఎకరాలు, 124.46 ఎల్‌ఎంటి, 2022లో 65 లక్షల ఎకరాలు, 138.06 ఎల్‌ఎంటి, గత ఏడాది 65.94 లక్షల ఎకరాలు 144.8 ఎల్‌ఎంటిలకు పెరిగింది. ఇప్పుడు కేఎల్‌ఐఎస్‌ను ఉపయోగించకుండానే వరిసాగు విస్తీర్ణం 66.77 లక్షల ఎకరాలకు పెరిగిందని, రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) దిగుబడి వచ్చిందని సీఎం తెలిపారు. ఈ ఘనతకు రైతులకు పాదాభివందనం చేసిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తుందని పునరుద్ఘాటించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాలంలోనూ ఈ ఉత్పత్తి స్థాయి అసమానమైనది.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద మూడు బ్యారేజీలు పనిచేయకపోవడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, తెలంగాణ ఈ అద్భుతమైన ఘనతను సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందించింది. ఈ మైలురాయి రైతులను ఆదుకోవడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.