Telangana: త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 2 March 2024 7:37 AM ISTTelangana: త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. విద్యా కమీషన్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి విధానాలను రూపొందిస్తుంది, అయితే రైతు కమిషన్ రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం సిఫార్సులు చేస్తుంది. వారి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తుంది. సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతుల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందన్నారు.
కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తీసుకురావాలన్న ఆలోచనను సీఎం, ప్రజాప్రతినిధులు పంచుకున్నారు. రైతు భరోసా ప్రయోజనాలను పొడిగించడంపై విస్తృత చర్చ జరగాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిస్సహాయులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అవసరమైతే నిజమైన లబ్ధిదారులకు మరింత సాయం అందించాలన్నారు. ఫసల్ బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలను అవలంబించాలని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. రైతులు అన్ని పంటలను పండించడానికి కొత్త పద్ధతులను అవలంబించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్, ప్రజాభవన్ తలుపులు తెరిచిందన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టనుందన్నారు.