సింగూరు, మంజీర, నిజాంసాగర్ రిజర్వాయర్‌లకు గోదావరి నది నుంచి నీటిని తరలించే ప్రణాళికలను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. టిపారుదల సౌకర్యాలను విస్తరింపజేస్తూనే హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడం తమ లక్ష్యమన్నారు. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగిన సమీక్షా సమావేశంలో మెదక్ జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఇంజనీర్లు ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సింగూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడిక తీసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతలు ఉపయోగించనుంది. హైదరాబాద్‌కు నీటి సరఫరా జరిగేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.