తెలంగాణ దశాబ్ది వేడుకలు.. నేడు మంచి నీటి పండుగ
మిషన్ భగీరథ పథకానికి కాలంతో సంబంధం లేదు. ఏ కాలమైనా తాగునీరు ఇంట్లోకి రావాల్సిందే. ఇదే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్
By అంజి Published on 18 Jun 2023 7:32 AM ISTతెలంగాణ దశాబ్ది వేడుకలు.. నేడు మంచి నీటి పండుగ
హైదరాబాద్: మిషన్ భగీరథ పథకానికి కాలంతో సంబంధం లేదు. ఏ కాలమైనా తాగునీరు ఇంట్లోకి రావాల్సిందే. ఇదే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేశారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రజల తాగునీటికి వనరుల కొరత ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకున్నది. 100 శాతం ఇళ్లకు రక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ తెలంగాణ అరుదైన ఘనత సాధించింది. ఈ గణనలో రాష్ట్రం సాధించిన దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మంచి నీటి పండుగగా జరుపుకుంటారు.
తాగడం, ఆహార తయారీ, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అన్ని గృహ అవసరాలకు సురక్షితమైన నీరు అవసరం. ఈ క్రమంలోనే ప్రజల కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణను 100 శాతం తాగునీటి సరఫరా రాష్ట్రంగా మార్చడంపై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో వివరిస్తారు. రాష్ట్ర నీటి కష్టాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విశ్వప్రయత్నాలు చేశారు. భవిష్యత్ తరాలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించారు.
ఆ విధంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి, పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి కల నెరవేరిందని శనివారం అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలోని 23,839 గ్రామాల్లో దాదాపు 57.01 లక్షల ఇళ్లు, మున్సిపాలిటీల్లో విలీనమైన 649 గ్రామాలకు, 121 మున్సిపాలిటీలు, అడవులు, కొండలపై ఉన్న 136 గ్రామీణ ఆవాసాలకు మిషన్ భగీరథ నీరు అందుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ సంస్థలకు కూడా కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.