TS TET: టెట్‌ దరఖాస్తులకు నేడే ఆఖరు

తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు బిగ్‌ అప్‌డేట్‌. నేటితో టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ దరఖాస్తు గడువు ముగియనుంది.

By అంజి  Published on  16 Aug 2023 2:15 AM GMT
Telangana,TET applications, Tet candidates

TS TET: టెట్‌ దరఖాస్తులకు నేడే ఆఖరు

తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు బిగ్‌ అప్‌డేట్‌. నేటితో టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ సాయంత్రం వరకు గడువు ఉండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎంతలేదన్నా కూడా 3 లక్షల లోపే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.టెట్‌ పేపర్‌-1కు 74,026 మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు. టెట్‌ పేపర్‌-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 1వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2వ తేదీ నుంచి తెలంగాణ విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు జరుగనున్నాయి. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు అధికారులు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునేందుకు అవకాశం ఉంది. అంచనా మేరకు రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌ అభ్యర్థులు ఉన్నారు. 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇది వరకు టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ మాత్రమే ఉండేది. రెండేళ్ల కిందట టెట్‌ వ్యాలిడిటీని జీవితకాలం పొడిగించారు.

గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా.. కొత్తగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉండనున్నారు. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే ఛాన్స్ దక్కనున్నది. ఇదిలా ఉంటే.. టెట్‌ కోసం పరీక్షా కేంద్రాల ఎంపిక అవకాశాన్ని కొన్ని జిల్లాల్లో నిలిపివేశారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగానే పలు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. టెట్‌ దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి గడువును మరో రెండు మూడు రోజులు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Next Story