తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. పదోతరగతి విద్యార్థుల ఫలితాలను ఈ నెల 21న (శుక్రవారం) విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన పరీక్షల విభాగం వాటిని మరోసారి పునఃపరిశీలన చేస్తోంది.
21వ తేదీన వీలుకాకపోతే 22వ తేదీన విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. మార్కుల మెమోలో హాల్‌టికెట్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. గత సంవత్సరం నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు ఆధారంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించగా, ఈ ఏడాది ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలతో మూతబడ్డాయి. ఆన్‌లైన్ లోనే క్లాసులు నిర్వహించారు. ఎన్నో రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేశారు.