తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత స్వైన్‌ఫ్లై కేసుల కలకలం
చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో స్వైన్‌ఫ్లై కేసులు కలవరం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Sep 2024 1:13 AM GMTతెలంగాణలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజారవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కొన్నిచోట్ల జనజీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే ప్రజలు చాలా మంది ఆస్పత్రుల పాలవుతంటే.. ఇంకొందరు వివిధ లక్షణాలతో ఇళ్లలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉన్నారు. నగరాలకే కాదు.. రాష్ట్రంలో ఉన్న పల్లెలకు కూడా విషజ్వరాలు వ్యాపించాయి.
చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో స్వైన్‌ఫ్లై కేసులు కలవరం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివివెంటివ్ మెడిసిన్ నాలుగు స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. మాదాపూర్‌లో ఉంటోన్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన యువకుడు తీవ్ర దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడ్డాడు. ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా.. స్వైన్‌ఫ్లైగా నిర్దారించారు. వైద్యులు. టోలిచౌకిలో కూడా మరో కేసు నమోదు అయ్యింది 69 ఏళ్ల వృద్ధుడిలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు చెప్పారు. నిజామాబాద్ పిట్లం మండలానికి చెందిన మరో వ్యక్తి, హైదర్‌నగర్ డివిజన్‌లోని మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వెల్లడించారు. జార్ఖండ్ నుంచి నగరానికి వచ్చి ప్రయివేట్ ఆస్పత్రిలో మరో వృద్ధురాలికి కూడా స్వైన్‌ఫ్లూ ఉంది.
ఇప్పటికే డెంగ్యూ సహా వైరల్ ఫీవర్లతో జనాలు బాధపడుతున్నారు. తాజాగా స్వైన్‌ఫ్లూ కూడా సోకడంతో నగరంలో డేంజర్ అలర్ట్ మొదలైంది. ఈ మేరకు ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.