తెలంగాణకు హరితహారం.. లక్ష్యాన్ని అధిగమించింది
Telangana surpasses Haritha Haram target.రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం
By తోట వంశీ కుమార్ Published on 20 Dec 2022 2:56 AM GMTరాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఏటా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. ఈ ఏడాది కూడా నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి మొక్కలు నాటారు. మంచి పనితీరును కొనసాగిస్తూ రాష్ట్ర అటవీ శాఖ తెలంగాణకు హరితహారం కింద 19.54 కోట్ల లక్ష్యానికి గాను 20.25 కోట్ల మొక్కలు నాటింది.
ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించడంతో వచ్చే ఏడాది 20.02 కోట్ల మొక్కలు నాటాలని ఆ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక మరియు ప్లాంటేషన్ డ్రైవ్‌లను సమర్థవంతంగా చేపట్టేందుకు జిల్లాల వారీగా లక్ష్యాలను ఇప్పటికే జిల్లా యంత్రాగాలకు నిర్దేశించింది.
సాధారణంగా ప్లాంటేషన్ డ్రైవ్‌లు నవంబర్-డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటినట్లు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్‌ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్లాంటేషన్ డ్రైవ్‌ల విజయానికి నాణ్యమైన విత్తనాల లభ్యత మరియు సోర్సింగ్ కీలకం. అటవీ శాఖ నిర్వహిస్తున్న 500 నర్సరీలు కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒకటి ఉంది. వీటిని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది.
మొక్కలు నాటేందుకు రెండు నెలల ముందుగానే పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాంటేషన్ డ్రైవ్‌తో పాటు, మొక్కల మనుగడపై సమాన దృష్టి పెట్టారు. అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు తమ పరిధిలో నాటిన మొక్కలను భౌతికంగా పరిశీలించి వాటికి జియో ట్యాగింగ్ చేస్తారు. తోటల పరంగా డేటా ప్రామాణికతను నిర్ధారించడమే కాకుండా, చెట్లను అనధికారికంగా నరికివేయడాన్ని అరికట్టడంలో కూడా ఇది సహాయపడుతుంది. భౌతిక తనిఖీ తర్వాత, డిపార్ట్‌మెంట్ సిబ్బంది డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని డోబ్రియాల్ చెప్పారు.
అడవుల విస్తీర్ణంలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. అనేక రాష్ట్రాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు అంతరాన్ని తగ్గించడానికి చూడకుండా ఇప్పటికే ఉన్న గ్రీన్ కవర్‌ను తగ్గించుకుంటున్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం.. ముంబై, పొరుగు జిల్లాల్లో 22,000 మడ చెట్లను నరికివేసే అవకాశం ఉంది.
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) 2021 ప్రకారం తెలంగాణలో ISFR 2019 మరియు 2021 మధ్య 632 చ.కి.మీ పెరుగుదల ఉంది. ఇది దేశంలో అటవీ విస్తీర్ణంలో రెండవ అత్యధిక పెరుగుదల. మహారాష్ట్రలో కేవలం 20 చ.కి.మీ పెరుగుదల ఉండడం గమనార్హం.
నివేదికల ప్రకారం ముంబై, పొరుగున ఉన్న పాల్ఘర్ మరియు థానే జిల్లాల్లో సుమారు 22,000 మడ చెట్లను నరికివేయడానికి బాంబే హైకోర్టు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL)కి అనుమతించింది. అయితే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్‌ను పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు మహారాష్ట్ర తీరప్రాంత నిర్వహణ అథారిటీ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలని ఆదేశించింది.