మార్చి 1వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శివాలయాలను సందర్శించే భక్తుల కోసం.. తమ బస్సులను అద్దెకు అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం తెలిపింది. బస్సు సర్వీసులను అద్దెకు తీసుకోవాలనుకునే వ్యక్తులు 040-3010 2829/040- 6815 3333కు కాల్ చేయవచ్చని టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే ఒక ప్రయాణంలో కనీసం 30 మందికి పైగా ప్రయాణికులు ఉంటే మాత్రమే బస్సు అద్దెకు ఇవ్వబడుతుంది.
మహా శివరాత్రి పర్వదినాన కీసరగుట్టలోని కేసరగిరి క్షేత్రంతోపాటు హైదరాబాద్ నగరంలోని శివాలయాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, పారిశుద్ధ్యంపై మరింత దృష్టి పెట్టడానికి జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లోనూ మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.