తెలంగాణలో భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు
Telangana State Discoms propose power tariff hike. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) గృహ వినియోగం కోసం యూనిట్‌కు
By అంజి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) గృహ వినియోగం కోసం యూనిట్‌కు 50 పైసలు, మిగిలిన అన్ని రంగాలకు యూనిట్‌కు రూ.1 చొప్పున విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించాయి. వారు 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌కి మొత్తం ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా టారిఫ్‌లను సమర్పించారు. దీని ప్రకారం.. లో-టెన్షన్ (ఎల్‌టి) వినియోగదారులకు విద్యుత్ టారిఫ్ పెంపు రూ. 2,110 కోట్ల అదనపు ఆదాయాన్ని, హై-టెన్షన్ (హెచ్‌టి) వినియోగదారులకు పెంపు ద్వారా రూ. 4,721 కోట్ల అదనపు రాబడిని పొందవచ్చని అంచనా. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు, క్షౌరశాలలు, లాండ్రీలకు, అలాగే పవర్‌లూమ్‌లు, పౌల్ట్రీ ఫామ్‌లు, స్పిన్నింగ్ మిల్లులు, ఇతరులకు యూనిట్‌కు రూ. 2 రాయితీని అందిస్తోంది.
వ్యవసాయ రంగానికి ఉచిత, నిరంతర విద్యుత్ సరఫరా ద్వారా దాదాపు 25.78 లక్షల మంది వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు 101 యూనిట్ల వరకు అలాగే నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు నిర్వహించే సెలూన్‌లు, చాకలి (రజక) సంఘం నిర్వహించే లాండ్రీలకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయబడుతుంది. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఎలాంటి టారిఫ్ సవరణ జరగకపోవడంతో టారిఫ్ పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి యొక్క రెండు వేవ్‌లు డిస్కమ్‌ల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇంకా కేంద్రం యొక్క విధానాలు విద్యుత్ ఉత్పత్తి, ప్రసార ఖర్చులు పెరగడానికి దారితీశాయి. ఇందులో టన్నుకు 50 రూపాయల నుండి టన్నుకు 400 రూపాయలకు క్లీన్ ఎనర్జీ సెస్ పెంపుదల, బొగ్గు ధరను టన్నుకు సుమారు 800 రూపాయల వరకు పెంచడం, రైల్వే సరుకు రవాణా ఛార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి. గత నాలుగేళ్లలో 40 శాతం పెట్రోలు, డీజిల్ ధరలను కూడా పెంచింది.