రాజన్న సిరిసిల్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ ప్రమాదంలో తెలంగాణ సచివాలయం మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగారాం మృతి చెందారు. 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం అకాల మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి తన బ్యాచ్ మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి గంగారం వెళ్లారు. తిరిగి బయల్దేరిన సమయంలో.. మూడవ అంతస్తు నుండి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, గంగారామ్ కిందికి దిగడానికి లిఫ్ట్ బటన్ నొక్కాడు. ఈ క్రమంలోనే ఏదో ఆలోచిస్తూ.. తాను ఉన్న ఫ్లోర్‌కి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ తెరిచారు.
అయితే లిఫ్ట్ అప్పటికి ఇంకా రాకపోగా.. డోర్ తెరుచుకుంది. దీంతో మూడో ఫ్లోర్ నుంచి కింద పడ్డ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డారు. ఛాతీకి తీవ్ర గాయాలు అయ్యాయి. గంటపాటు శ్రమించి గంగారాంను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గంగారాం మృతి చెందారు. గంగారావు మృతితో పోలీస్ బెటాలియన్‌లో విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం సిరిసిల్ల ఆస్పత్రికి పోలీస్ బెటాలియన్ సిబ్బంది అధికారులు చేరుకొని గంగారం మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. గంగారాంకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం గ్రామం.