Telangana: ధరణి పోర్టల్‌పై కమిటీ ఏర్పాటు
ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించడం, రీస్ట్రక్చర్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
By అంజి Published on 10 Jan 2024 6:35 AM ISTTelangana: ధరణి పోర్టల్‌పై కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించడం, రీస్ట్రక్చర్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ఎం. కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, బి. మధుసూధన్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (రిటైర్డ్) సభ్యులుగా ఉండగా, భూపరిపాలన ప్రధాన కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటిగ్రేటెడ్ భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ధరణి ప్రధాన అంశాల్లో ఒకటిగా మారిన విషయం తెలిసిందే.
రైతులు, ఇతరుల భూములను లాక్కోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించిందని, దానిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో, ధరణి పోర్టల్ స్థానంలో “భూమాత” పోర్టల్‌ను తీసుకువస్తామని చెప్పింది. భూమిపై హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కాగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో రాజకీయ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి పేదవారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు.
త్వరలో ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. నియోజక వర్గాల్లో నిజాయితీ, చిత్తశుద్ధి గల అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని రేవంత్ రెడ్డి వారికి సూచించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. పాత జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు నిధుల వినియోగం బాధ్యతలు అప్పగించారు.
అసెంబ్లీ నియోజకవర్గాలను ఇన్‌చార్జి మంత్రుల సమన్వయంతో అభివృద్ధి చేసి సమస్యలు పరిష్కరించాలని, పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. 17 స్థానాలకు గానూ 12 సీట్లకు తగ్గకుండా గెలవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం.