న్యాయ సలహాల తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ స్పందిస్తారు: కిషన్‌రెడ్డి

తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ ఎలా స్పందిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి వివాదంపై స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 1:50 PM IST
Telangana, RTC Bill, Governor, BJP Kishan Reddy, Comments,

న్యాయ సలహాల తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ స్పందిస్తారు: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినది కావడంతో బిల్లుని గవర్నర్‌ వద్దకు పంపింది ప్రభుత్వం. బిల్లులో స్పష్టత లేని అంశాలు ఉన్నాయంటూ వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అయితే.. వెంటనే స్పందించిన ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. మరోసారి కూడా ఇదే రిపీట్ అయ్యింది. దాంతో.. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్‌ కార్యాలయం అన్నట్లు పరిస్థితి నెలకొంది. దాంతో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రశ్నలు, సమాధానాలు.. ఉత్తర, ప్రత్యుత్తరాలు..సందేహాలు, వివరణలతో ఆర్టీసీ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించిన వివాదంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. గవర్నర్‌ తమిళిసై సానుకూల నిర్ణయమే తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ సలహాలు తీసుకుని.. అన్ని పరిశీలించాకే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుపై స్పందిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం.. భద్రత కోసమే గవర్నర్‌ ప్రయత్నిస్తున్నారంటూ చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశాలు పొడిగించి అయినా.. బిల్లును పాస్‌ చేయించుకోవచ్చని అన్నారు కిషన్‌రెడ్డి. ప్రభుత్వం ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తుందని కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కార్మికులపై ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అంతేకాదు.. ఆర్టీసీకి సంబంధించిన వేల కోట్ల ఆస్తులపై బీఆర్ఎస్ నేతలు కన్ను వేశారని కూడా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.

అయితే.. గవర్నర్‌ తమ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. గవర్నర్‌కు నిరసన కూడా తెలిపారు. అయితే.. ఆర్టీసీ కార్మికుల నిరసనలతో స్పందించిన గవర్నర్ తమిళిసై.. తాను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకం కాదని తెలిపారు. బిల్లులో సందేహాలు అడి వివరణ తీసుకుంటున్నాని చెప్పారు. దీనిపై సాధ్యమైనంత త్వరగానే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు గవర్నర్ తమిళిసై. అయితే.. చాలా కాలంగా గవర్నర్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య సఖ్యత లేదు. గవర్నర్‌ను ఏ కార్యక్రమానికి పిలవకపోవడం.. దూరంగా పెట్టింది. అంతేకాక.. గవర్నర్‌ కూడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story