Telangana: సన్నాలకు ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్‌

సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది.

By -  అంజి
Published on : 24 Oct 2025 10:48 AM IST

Telangana, 500 bonus, fine grain, Paddy

Telangana: సన్నాలకు ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్‌

హైదరాబాద్‌: సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటేనే బోనస్‌ వస్తుంది. గ్రెయిన్‌ కాలిపర్‌ అనే మిషన్‌ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6 ఎంఎం, వెడల్పు 2 ఎంఎం కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5 ఎంఎం కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. ధాన్యం తేమ 17% కంటే తక్కువగా ఉండాలి.

కాగా వర్షాకాల సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించనున్నట్టు అంచనా వేసిన నేపథ్యంలో, ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రంలో దిగుబడి సాధించిన ధాన్యంలో 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల మేరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌర సరఫరాల విభాగం అంచనా. కేంద్ర ప్ర‌భుత్వం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సేక‌ర‌ణ‌కు అంగీక‌రించింది. మ‌రో 15 లేదా 20 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించాల‌ని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ధాన్యం కొనుగోళ్ల‌ను ప‌క‌డ్బందీ చర్యలు తీసుకోవడమే కాకుండా, ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోన‌స్ ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.

Next Story