తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం రేవంత్
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ,..
By - అంజి |
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం రేవంత్
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంట్ విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు.
కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తారు.
ఎవరిని ఆహ్వానించారు, అతిథుల రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని, అందులో వెయ్యి మంది వరకు ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.