మొబైల్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ.. 13 నెలల్లో 30,049 దొంగిలించబడిన ఫోన్లు స్వాధీనం
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌పోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసు అధికారులు తెలిపారు.
By అంజి Published on 21 May 2024 5:07 PM ISTమొబైల్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ.. 13 నెలల్లో 30,049 దొంగిలించబడిన ఫోన్లు స్వాధీనం
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌పోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసు అధికారులు తెలిపారు. 2023 ఏప్రిల్ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ యూనిట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 76 మొబైల్స్ రికవరీ అయ్యాయి. మొత్తంగా 35,945 రికవరీలతో మొదటి స్థానంలో ఉండగా, 7,387 ఫోన్ల రికవరీలతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది.
చోరీ చేసిన మొబైల్ ఫోన్‌లతో నేరాలకు పాల్పడుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లాంఛ్ చేసిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. మొబైల్ పోయిన 24 గంటల్లో సీఈఐఆర్‌లోకి లాగిన్ అయి ఐఎంఈఐ బ్లాక్ చేయాలి. దీని ద్వారా మొబైల్‌లోని సమాచారం దుర్వినియోగం కాదు. ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలని పోలీసు అధికారులు చెబుతున్నారు.
CEIR పోర్టల్ అంటే ఏమిటి?
మొబైల్ దొంగతనం మరియు నకిలీ మొబైల్ పరికరాల వ్యాప్తిని అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT) CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. CEIR పోర్టల్ అధికారికంగా మే 17, 2023న దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించబడింది.