తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్

2022-23లో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో రూ.1.24 లక్షల

By అంజి
Published on : 31 March 2023 2:15 PM IST

Telangana, per capita income, Minister KTR

తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అతివేగంగా దూసుకుపోతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 2022-23లో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో రూ.1.24 లక్షల నుంచి 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగిందని ట్వీట్ చేశారు. తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధి అన్ని రాష్ట్రాల కంటే అత్యధికమని మంత్రి కేటీఆర్ రాశారు.

''దూరదృష్టి ఉన్న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకున్నా తెలంగాణ రాష్ట్రం నిరంతర వృద్ధి సాధిస్తోందని అన్నారు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) నుంచి వచ్చిన నివేదికపై కేటీఆర్‌ స్పందించారు. వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను లోక్‌సభలో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు.

మార్చి 15 నాటికి ప్రస్తుత ధరల ప్రకారం.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732. రూ.3,01,673తో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, రూ.2,96,685తో హర్యానా మూడో స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2013-14లో రూ.1,12,162 నుంచి 2022-23 నాటికి రూ.3,17,115కు పెరుగుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు గత నెలలో రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు. ఇది జాతీయ తలసరి ఆదాయం రూ.1,70,620 కంటే 86 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు.

Next Story