తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 1:08 PM ISTతెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
భారీ వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలపై నిరంతరం పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. ఇక విద్యాసంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంద్రారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఇక శనివారం మొహర్రం కావడంతో సెలవు ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆదివారం వస్తుంది. అంటే విద్యాసంస్థలు మళ్లీ సోమవారం రోజునే తెరుచుకోనున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పి.గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. వరద ప్రవహం ఎక్కువగా ఉంటుందని. అవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అంతేకకాక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.