ఖమ్మం లోక్‌సభ సీటు ఇవ్వాలని సీఎం రేవంత్‌ను కోరా: వీహెచ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 2:07 PM IST
telangana, politics, v.hanumantha rao,  brs,

 ఖమ్మం లోక్‌సభ సీటు ఇవ్వాలని సీఎం రేవంత్‌ను కోరా: వీహెచ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లిక్కర్‌ స్కాం కేసుతో పాటు.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కూడా సంచలనంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్‌.. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో తేలాలని అన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు రికార్డులు చేసిందని వి.హనుమంతరావు ఆరోపించారు.

ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా చాలా అంశాలు బయటకు రావాల్సి ఉందని వి.హనుమంతరావు చెప్పారు. రాజకీయ నాయకులు, బిజినెస్‌ మ్యాన్‌ల ఫోన్లు ట్యాప్‌ చేశారని వీహెచ్‌ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అసలు సూత్రధారులు ఎవరు అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్‌ అయ్యారనీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు చెప్పారు. నయీం అనే గ్యాంగ్‌స్టర్‌ గతంలో కోట్ల రూపాయలు, భూములు కాజేశారనీ.. నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయని వి.హనుమంతరావు ప్రశ్నించారు. సిట్‌ అధికారిగా నాగిరెడ్డి ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి వీటిపై విచారణ జరిపితే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చని వీహెచ్‌ అన్నారు.

ఇక ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని వి.హనుమంతరావు చెప్పారు. ఖమ్మం లోక్‌సభ సీటు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరిట్లు తెలిపారు. రాజీవ్‌గాంధీతో కలిసి ఖమ్మం నియోజకవర్గంలో తిరిగినట్లు గుర్తు చేసుకున్నారు. ఇక ఖమ్మం టికెట్‌ తనకు కేటాయిస్తే మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని దీమా వ్యక్తం చేశారు. అయితే.. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్‌ అధిష్టానిదే అనీ.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని వి.హనుమంతరావు అన్నారు.

Next Story