తెలంగాణలో ఉద్యోగాల జాతర.. అబ్కారీ, ర‌వాణాశాఖ‌లో 677 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Telangana Police Recruitment Board notifies 677 Constable posts. తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాత‌ర మొద‌లైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2022 3:19 AM GMT
తెలంగాణలో ఉద్యోగాల జాతర.. అబ్కారీ, ర‌వాణాశాఖ‌లో 677 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాత‌ర మొద‌లైంది. వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల అవుతున్నాయి. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల కాగా.. గురువారం ట్రాన్స్‌పోర్ట్, అబ్కారీ శాఖల్లోని కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర‌స్థాయి పోలీస్ నియామ‌క మండ‌లి నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలోని 63 కానిస్టేబుల్‌ పోస్టులు, ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (అబ్కారీ)లో 614 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.

కానిస్టేబుల్ పోస్టుల‌కు వ‌య‌సు, విద్యార్హ‌త‌లు పోలీసుశాఖ‌లో మాదిరిగానే అంటే 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు మించ‌కుండా ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. మిగ‌తా అర్హ‌త‌లు కూడా పోలీస్ కానిస్టేబుల్‌కు వ‌ర్తించేవే వీటికీ ఉంటాయి. కాగా.. ర‌వాణాశాఖ‌లో కానిస్టేబుల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి లైట్ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్ ఉండాలి. కంటిచూపు పూర్తిస్థాయిలో ఉండాలి. అర్హ‌త‌లు క‌లిగిన ఉన్న‌వారు మే 2 నుంచి 20 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు రూ.400, ఓసీ, బీసీ అభ్య‌ర్థులు రూ.800 ద‌ర‌ఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

కాగా.. అబ్కారీ, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ గతంలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించేది. అయితే యూనిఫాం పోస్టులకు సంబంధించిన పూర్తి నియామక ప్రక్రియను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ప్రభుత్వం అప్పగించింది. అన్ని పోస్టులకు విద్యార్హతలతో పాటు నియామక ప్రక్రియ దాదాపుగా ఒకే విధంగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story