విచారణకు రండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
ఫామ్ హౌస్‌లో కోడి పందేలు నిర్వహించారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 13 March 2025 8:54 AM IST
ఆ కేసులో విచారణకు రండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
ఫామ్ హౌస్‌లో కోడి పందేలు నిర్వహించారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. గత నెలలో తోల్కట్టలోని ఫామ్ హౌస్‌లో భారీగా కోడి పందేలు, కేసినో నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చానని గతంలో పోలీసులకు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న మొయినాబాద్ పోలీసులు మొదటిసారి పోచంపల్లికి నోటీసులు ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..'ఫామహౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్హహౌస్కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.