ఇందిరమ్మ చీరల పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సభ్యులకు 65 లక్షల 'ఇందిరమ్మ చీరల' పంపిణీ..
By - అంజి |
ఇందిరమ్మ చీరల పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సభ్యులకు 65 లక్షల 'ఇందిరమ్మ చీరల' పంపిణీ నవంబర్ 15 నాటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ, ఎన్నికల్లో 42 శాతం BC కోటాకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించిన తర్వాత తిరిగి ప్రారంభమైంది. శుక్రవారం సచివాలయంలో జౌళి మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ , TSCO తెలంగాణ చేనేత అధికారులు సహా సీనియర్ అధికారులతో చీరల పంపిణీ కార్యక్రమం అమలును సమీక్షించారు.
ఈ పథకంలో కీలక పాత్ర పోషిస్తున్న చేనేత కార్మికుల శ్రేయస్సును నిర్ధారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ఈ పథకానికి 64.69 లక్షల చీరల ఉత్పత్తికి 4.34 కోట్ల మీటర్ల ఫాబ్రిక్ అవసరమని, అందులో 3.65 కోట్ల మీటర్లు పవర్‌లూమ్ కార్మికులు ఇప్పటికే నేశారని ఆయన అన్నారు. ఇప్పటివరకు, TSCO పర్యవేక్షణలో జిల్లా గిడ్డంగులకు 33.35 లక్షల చీరలు సరఫరా చేయబడ్డాయి. ఈ కార్యక్రమం కింద దాదాపు 6,900 మంది చేనేత కార్మికులు ఆరు నుండి ఎనిమిది నెలల స్థిరమైన ఉపాధిని పొందారు, నెలకు రూ.18,000 నుండి రూ.22,000 మధ్య జీతం పొందుతున్నారు.
చేనేత మరియు పవర్ లూమ్ యూనిట్లకు స్థిరమైన పని ఉండేలా చూసేందుకు, అన్ని ప్రభుత్వ ఫాబ్రిక్ ఆర్డర్‌లను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఆయ శాఖలు, కార్పొరేషన్లను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాత్కాలికంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌కు వీలైనంత త్వరగా తరలించాలని ఆయన ఆదేశించారు.