Telangana: రెండో దశ గొర్రెల పంపిణీ.. ఎప్పటినుంచంటే?

జూన్ 2న ప్రారంభమయ్యే 21 రోజుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల

By అంజి  Published on  2 Jun 2023 2:30 PM IST
Telangana, sheep distribution, talasani srinivas yadav, Telangana Formation Day

Telangana: రెండో దశ గొర్రెల పంపిణీ.. ఎప్పటినుంచంటే?

హైదరాబాద్: జూన్ 2న ప్రారంభమయ్యే 21 రోజుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2018 నాటికి 1 కోటి 28 లక్షల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. గొర్రెల పంపిణీని నల్గొండ జిల్లా నక్రేకల్‌లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ లాంఛనంగా ప్రారంభించనుండగా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ వ్యాప్తంగా తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో అర్హులైన గొల్ల కురుమ సంఘం సభ్యులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన 3.93 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. రెండో దశలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా.

గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసేందుకు అధికారులతో పాటు లబ్ధిదారులను తీసుకెళ్లాలి. పారదర్శకంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలి అని మంత్రి అన్నారు. లబ్ధిదారులందరికీ మందులు, దాణా, బీమా ట్యాగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరగా, మాదాసి కురువ సంఘం వారిని కూడా పథకం కింద లబ్ధిదారులుగా చేర్చాలని కోరగా శ్రీనివాస్ యాదవ్ ఆమోదించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో వివిధ పథకాల కింద లబ్ధిదారులను భాగస్వాములను చేయాలని పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య శాఖల అధికారులను ఆదేశించారు. ముందుగా ప్రజాప్రతినిధులకు తెలియజేసి గొర్రెల పంపిణీ పథకంలో వారి భాగస్వామ్యం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

జూన్ 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో చేపల ఆహారోత్సవాలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి 20 నుంచి 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి శిక్షణ పొందిన మహిళా మత్స్యకారులు తయారుచేసిన ఫిష్ ఫ్రై, బిర్యానీ, ఫిష్ సూప్ వంటి వంటకాలను అందిస్తారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాస్ యాదవ్ చేపల ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనుండగా, అదే రోజు స్థానిక ప్రజాప్రతినిధులు తమ జిల్లాల్లో వీటిని ప్రారంభిస్తారు.

జూన్ 3న తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద జరిగే రైతు దినోత్సవ వేడుకల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొననున్నారు. జూన్ 8న చెరువుల పండుగలో భాగంగా అన్ని రిజర్వాయర్ల వద్ద చేపలు, రొయ్యల పంపిణీపై స్టాళ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వివరణ ఇవ్వనున్నారు. అన్ని పశువైద్యశాలల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

Next Story