హరీశ్ రావుకు ఆరోగ్య శాఖ ఇవ్వబోతున్నారా.. ?
Telangana New Health Minister. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. అయితే ఈ వ్యవహారాలను హరీష్ రావుకు అప్పజెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
By Medi Samrat Published on 19 May 2021 7:26 PM ISTతెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! ఈటల రాజేందర్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది. ఆ విషయాన్ని అటుంచితే.. దేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. పలు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖా మంత్రులకు చాలానే భారం పడుతూ ఉంది. ఓ వైపు కరోనా పరీక్షలు.. మరో వైపు వ్యాక్సిన్లు.. ముఖ్యంగా ఆసుపత్రుల్లో రోగులకు అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా.. ఇలా చాలా విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. అయితే ఈ వ్యవహారాలను హరీష్ రావుకు అప్పజెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో పలు సమీక్షలకు హరీష్ రావు హాజరవుతూ ఉన్నారు. మంత్రి హరీష్ రావు తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం కోవిడ్ చికిత్సకు సంబంధించి అవసరమైన సౌకర్యాలు, అందుబాటులో ఉన్న ఔషధాలపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై కూడా చర్చించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాలు, బెడ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇక హైదరాబాద్ లోని పలు ఆసుపత్రులను కూడా హరీష్ రావు పరిశీలిస్తూ ఉన్నారు. కోఠి ఆసుపత్రిని పరిశీలించిన హరీష్ రావు.. నేడు గాంధీ ఆసుపత్రిని కూడా పరిశీలించారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా అత్యవసర వార్డును కూడా సీఎం కేసీఆర్ తో కలిసి సందర్శించారు. చికిత్స పొందుతోన్న కరోనా రోగులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఓపీ విభాగంలోనూ కరోనా చికిత్స సదుపాయాలపై కేసీఆర్ ఆరా తీశారు. జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఆరోగ్య శాఖ అప్పగించడం సరైన నిర్ణయమనే భావిస్తున్నట్లు కేసీఆర్ అనుకుంటున్నారనే వార్తలు కూడా మొదలయ్యాయి. త్వరలోనే మంత్రి హరీశ్ రావుకు వైద్య,ఆరోగ్యశాఖ ఇవ్వడం దాదాపు ఖాయమని కొందరు టీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారు. హరీశ్ రావు ముందుగా వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు సమీక్షల్లో పాల్గొన్న తరువాత ఆయనకు ఈ శాఖ అప్పగించవచ్చని అంటున్నారు. హరీశ్ రావుకు కీలకమైన వైద్య,ఆరోగ్యశాఖ అప్పగిస్తే.. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఆర్థికశాఖను ఎవరికి ఇస్తారా అనే ప్రశ్నలు కూడా మనల్ని వెంటాడుతున్నాయి.