మార్చి 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్డీఎస్ఏ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ మార్చి 6న రాష్ట్రానికి రానుంది.

By అంజి  Published on  4 March 2024 5:16 AM GMT
Telangana, NDSA team, Kaleshwaram project

మార్చి 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్డీఎస్ఏ బృందం

తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (కేఎల్‌ఐఎస్‌)లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌, నిర్మాణాల పరిశీలన, అధ్యయనానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణుల కమిటీ మార్చి 6న రానుందని, ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తెలిపారు.

ఎన్‌డిఎస్‌ఎ సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఉద్ఘాటించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడానికి గల కారణాలపై కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేస్తుందని, అన్నారం, సుందిళ్ల రెండు అప్‌స్ట్రీమ్ బ్యారేజీల దుస్థితిని పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు.

డ్యామ్‌సేఫ్టీ యాక్ట్‌ 2021లోని సెక్షన్‌ 8ని అనుసరించి ఎన్‌డీఎస్‌ఏ తాజాగా నిపుణుల కమిటీని ఏర్పాటైంది. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ను చైర్మన్‌గా, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ సైంటిస్ట్‌ యూసీ విద్యార్థి, సెంట్రల్‌ వాటర్‌, పవర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ సైంటిస్ట్‌ ఆర్‌ పాటిల్‌, సీడబ్ల్యూసీ బీసీడీ డైరెక్టర్‌ శివకుమార్‌ శర్మ, గేట్స్‌, సీడబ్ల్యూసీ, డిజాస్టర్‌ అండ్‌ రెసిలియెన్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌కుమార్‌సింగ్‌ను సభ్యులుగా నియమించింది.

మేడిగడ్డ బ్యారేజీ పైర్లు మునిగిపోవడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగే నష్టాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరడంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం వెంటనే నీటిని ఖాళీ చేయాలని సిఫారసు చేసింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల తనిఖీల అనంతరం ఇలాంటి సమస్యలను గుర్తించి వాటిని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసింది.

అయితే ఆ బ్యారేజీలను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు సాంకేతిక పరిజ్ఞానం లేదని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు.

Next Story