టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. లావు శ్రీకృష్ణదేవరాయ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలాగా.. తెలంగాణ ప్రజలను అవమానపరిచేలాగా లావు శ్రీకృష్ణదేవరాయ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. కాకా, వివేక్ వెంకటస్వామిలు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. కాకా బుల్లెట్ గాయాలు తిన్నారు.. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా కూడా లేడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాకుండా ప్రస్తుతం నడుస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ పై చర్చకు ముందుకు రావాలన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ లో పేరు ఉన్న బిల్ గేట్స్ తో చెత్తపట్టాలెసుకొని చంద్రబాబు, లోకేష్ తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
అంతకుముందు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై లోక్‌సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ పార్లమెంట్ చరిత్రలోనే ఆ రోజును ఒక‘బ్లాక్ డే’గా ఆయన అభివర్ణించారు. బుధవారం స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కి ఏపీని విభజించిందని విమర్శించారు. సాధారణంగా అసెంబ్లీ ఆమోదించని ఏ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరని తెలిపారు. కానీ, నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజనను వ్యతిరేకించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా బిల్లును ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. ఫిబ్రవరి 13, 2014న బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సొంత పార్టీ వారితో సహా మొత్తం 18 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బిల్లు పాస్ అయ్యే సమయంలో లోక్‌సభ తలుపులు, గ్యాలరీలు మూసివేసి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లైవ్ టెలికాస్ట్‌ను నిలిపివేశారన్నారు. విభజన బిల్లుపై అసలు ఓటింగ్ జరిగిందా లేదా అన్నదానికి ఆధారాలు లేవని, ఎంతమంది అనుకూలంగా ఓటు వేశారో చెప్పే రికార్డులు కూడా లేవని ఆర్టీఐ ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు.