ఎన్నికల కోడ్‌ తర్వాత అర్హులకు రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.

By Srikanth Gundamalla  Published on  1 April 2024 10:51 AM GMT
telangana, minister uttam kumar reddy, comments, brs ,

ఎన్నికల కోడ్‌ తర్వాత అర్హులకు రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ 

గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. తమ పాలన చూసే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంతా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తెలంగాణలో మరోసారి సత్తా చాటబోతుందని అన్నారు. నల్లగొండలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్‌ కూడా రాదు అని జోస్యం చెప్పారు. 14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని మంత్రి ఉత్తమ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికల కోడ్‌ తర్వాత అర్హులైన వారికి తెల్లరేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లని వదిలే ప్రసక్తే లేదని.. వందశాతం తన ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారని అన్నారు. దీని వెనుక ఎంతమంది బడా నాయకులు ఉన్నా శిక్ష పడుతుందని చెప్పారు. ఇక కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఒక కేసులో ఇరుక్కుపోయారనీ.. ఇంకొందరు గొర్రెల స్కాంలో ఇరుక్కున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఎప్పుడూ ఫామ్ హౌస్‌లోనే ఉండేవారనీ.. కానీ ఆయనలా తాము కాదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కోసం పనిచేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. ప్రతి రోజూ సచివాలయానికి వస్తున్నామనీ.. ప్రతి సమస్యపై వారం, పదిరోజులకు ఓసారి రివ్యూ చేస్తున్నామన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దబాయింపు చేశారనీ.. బీఆర్ఎస్‌కు మరోసారి అధికారం వస్తుందనేది వారి కలే అంటూ మంత్రి ఉత్తమ్‌ విమర్శలు చేశారు.

డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉండి ఆదివారం మీడియాతో మాట్లాడారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ స్పీచ్ విన్న తర్వాత ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారని అనిపించిందని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోవడం మాత్రమే కాదు.. మెల్లిమెల్లిగా తెలంగాణలో పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోతుందనే భయం కేసీఆర్‌లో మొదలైందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏదో జాతీయ పార్టీ అని పేరు మార్చుకున్నారు కానీ.. ఇంత తొందరగా కూలిపోతుందని వారు కూడా ఊహించలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోతుందనీ.. ఎవరూ పార్టీని ఆదరించరని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Next Story