రైతుభరోసా అమలుపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్యారెంటీలను అమలు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 4:36 AM GMTరైతుభరోసా అమలుపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైతుభరోసా పథకం కింద ఏడాదికి ఏకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకారకు రూ.10వేలు ఇవ్వగా.. దాన్ని 15వేలకు పెంచి ఇస్తామని చెప్పింది కాంగ్రెస్. అయితే.. ఇప్పటి వరకు రైతుభరోసాను అమలు చేయలేదు. గతంలో ఒకసారి పాత అమౌంట్‌నే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు మరో విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి అయినా పెంచిన డబ్బులను జమ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే రైతుభరోసా పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త మార్గదర్శకాలతో రైతు భరో అమలు చేసేందుకు సిద్ధం అవ్వాలని చెప్పారు. ఇందులో భాగంగా రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచనలు చేశారు. అంతేకాదు.. కేవలం సాగు చేసే భూములకే పంట సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో తెలంగాణలోని 110 నియోజకవర్గాల్లోని రైతుల వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఆయా నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి అన్నదాతలను రైతు వేదికలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ పనులను అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పగించాలని మంత్రి తుమ్మల సూచనలు చేశారు. ఆ తర్వాత ఆ ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వానికి అందించాలని చెప్పారు.
వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తీసుకుని వాటి ఆధారంగానే రైతుభరోసా అమలు చేయాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విసయం తెలిసిందే. ప్రజాధనం వృధా కావొద్దని కేబినెట్ అభిప్రాయ పడింది. ఈ మేరకు అర్హులకు మాత్రమే రైతుభరోసా అందేలా చూడాలన్నారు. కేవలం సాగు చేసే భూములకే పంట పెట్టుబడి సాయం అందించాలనీ.. దీనికి అనుగుణంగా విధివిధానాలను ఖరారు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.