రైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణలో రైతులంతా రైతుబంధు నిధుల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 1:14 AM GMTరైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణలో రైతులంతా రైతుబంధు నిధుల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి.కానీ సగానికి పైగా రైతులకు మాత్రం రైతుబంధు డబ్బులు అందలేదు. దాంతో.. తమకు కొత్త ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా.. రైతుబంధు నిధుల జమపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుభరోసా పేరుతో ఆర్థిక సాయం చేద్దామని అనుకుంది. అయితే. దీనికి సంబంధించి విధివిధానాలు తయారు కాలేదు. దాంతో.. గతంలో ఇచ్చినట్లుగానే రైతుబంధు నిధులుఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే నిధలు విడుదల చేశామని చెప్పింది. రైతుబంధు డబ్బులు ఎకరాల లెక్కన విడుదల చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 లక్షల మంది రైతుల ఖాతాల్లో అంటే 40 శాతం మంది రైతులకు రైతుబంధు డబ్బులు అందాయి. రైతుబంధు సంబంధిత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే రైతుబంధుపై కీలక ప్రకటన చేశారు.
రైతుబంధు నిధులు రైతులకు త్వరితగతిన వారివారి ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వరి, ఇతర యాసంగి పంటల నాట్లు, సాగు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ సాయం రోజువారీ విడుదల చేయాలన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గత ప్రభుత్వం నుంచి తమ వరకు సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు వచ్చినా.. తాము నిధులు విడుదల చేసేందుకు సుముఖంగానే ఉన్నామన్నారు. దీనిపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం నుంచి ఎక్కువ మంది రైతులకు రైతుబంధు సాయం చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. నెలాఖరు వరకు అందరికీ రైతుబంధు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.