రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధనపై మంత్రి తుమ్మల వివరణ

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.

By Srikanth Gundamalla
Published on : 16 July 2024 6:55 AM IST

Telangana, minister tummala,  ration card guidelines,  loan waiver,

  రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధనపై మంత్రి తుమ్మల వివరణ

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. రుణమాఫీ -2024 పథకంలో భాగంగా రేషన్‌కార్డు నిబంధనను పొందుపర్చింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం సాయంత్రమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతురుణ మాఫీలో రేషన్ కార్డు నిబంధనపై వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం అమలు చేయనున్న రుణమాఫీ పథకంలో రైతుకుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ వద్ద రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతులందరి వివరాలు ఉన్నాయని అన్నారు. కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

రైతు రుణమాఫీపై మార్గదర్శకాల ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత.. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి తుమ్మల మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ మేరకు బీఆర్ఎస్ పై మండిపడ్డారు. అనవసరంగా బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న విధానాలనే ప్రస్తుతం తాము అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరరావు. రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. మాజీమంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి కి రైతు రైతురుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 2018లో రెండోదఫా రుణాఫీకి రూ.20కోట్లు పరకటించి ఎన్నికలకు ముందు 2023లో హడావుడిగా రూ.13వేల కోట్లను మాత్రమే విడుదల చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. అందులోనూ రూ.1400 కోట్లు వెనక్కి వచ్చాయన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం మిగిల్చిపోయిన అప్పులను తీరుస్తున్నామని అన్నారు. అలాగే రైతు రుణమాఫీ రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను మానుకోవాలని హితవు పలికారు.

Next Story