సినీ నటులకు మేం వ్యతిరేకం కాదు: మంత్రి సీతక్క

పనిగట్టుకుని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 4:00 PM GMT
సినీ నటులకు మేం వ్యతిరేకం కాదు: మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శలు చేస్తూ సినీ నటులను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆయనవల్లే విడాకులు తీసుకున్నారంటూ చెప్పారు. దాంతో.. ఆమె కామెంట్స్‌ సంచలనంగా మారాయి. ఇప్పటికే నాగార్జున, సమంతతో పాటు పలువురు స్పందించారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పారు. కాగా.. ఇదే అంశంపై మరో మహిళా మంత్రి సీతక్క స్పందించారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పనిగట్టుకుని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుందని చెప్పారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినిమా ప్రముఖులపై మాత్రమే కొండా సురేఖ మాట్లాడారని చెప్పారు. సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాళ్లను ద్వేషించడం లేదని చెప్పుకొచ్చారు. గతంలో మహిళా మంత్రుల చరిత్ర, ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర అందరికీ తెలుసని మంత్రి సీతక్క అన్నారు. తాము ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులమని చెప్పుకొచ్చారు.

అలాగే బీఆర్ఎస్ పార్టీపైనా మంత్రి సీతక్క విమర్శలు చేశారు. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చాటుగా మాట్లాడటం కాదని, నేరుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. పండగపూట అనవసరంగా తమను విమర్శించవద్దని సూచించారు మంత్రి సీతక్క.

Next Story