కార్పొరేటర్ల ఇండ్ల ముందు ఫ్లెక్సీలు..బ్లాక్ మెయిల్ ఏంటని పొన్నం ఫైర్
ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సిటీలోని పలు చోట్ల హిందువుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి
By Knakam Karthik
కార్పొరేటర్ల ఇండ్ల ముందు ఫ్లెక్సీలు..బ్లాక్ మెయిల్ ఏంటని పొన్నం ఫైర్
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సిటీలోని పలు చోట్ల హిందువుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. హిందువులను కించపరిచే ఎంఐఎం పార్టీకి తొత్తులుగా వ్యవహరించవద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లకు సూచించారు. ఎంఐఎం అడుగులకు మడుగులొత్తే అధిష్టానం ముఖ్యమా, ఓట్లు వేసి గెలిపించిన హిందువులు ముఖ్యమా అని నిలదీశారు. మేలుకోండి బీఆర్ఎస్ - కాంగ్రెస్ కార్పొరేటర్లారా! హిందువులకు అండగా నిలవాలంటే ఎంఐఎంకు మద్దతు ఇవ్వకండి.. అంటూ హిందువుల పేరుతో బ్యానర్లు కట్టారు. కార్పోరేటర్‌కి విజ్ఞప్తి 15 నిమిషాలు సమయమిస్తే మమ్మల్ని చంపేస్తామన్న ఎంఐఎంకు ఓటు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో మేం మీకు ఓటెయ్యం అని హిందువులు బ్యానర్లలో హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బ్లాక్ మెయిల్ చేయడమేంటి?
అయితే కార్పొరేటర్ల ఇంటి ముందు బ్యానర్లు కట్టడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కాదా? బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. ఇంత రెచ్చగొట్టే పనులు చేస్తున్నా.. ఎన్నికల అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారు? బీజేపీ గెలవడానికి కావాల్సినంత బలం లేకపోయినా పోటీ చేయడం ఏంటి? కార్పొరేటర్ల ఇండ్ల ముందు బ్యానర్లు కట్టి బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? మేం ఎవరికి ఓటు వేయాలో మా స్ట్రాటజీ మాకు ఉంది. మా అధిష్టానం చెప్పిన వారికే ఓటు వేస్తాం..అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోందనే ప్రచారం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఎవరికీ సపోర్ట్ చేయవద్దని కార్పోరేటర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు 110 ఉన్నాయి. అందులో ఎంఐఎం పార్టీకి 49 ఓట్ల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 24 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు 6 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 25 మంది ఉన్నారు.