తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లిలోని గ్రామ పంచాయతీ భవనం, అదనపు క్లాస్ రూమ్‌లను ప్రారంభిస్తారు. అక్కడి నుండి వెంకటాపూర్‌కు చేరుకుని.. కొత్త నిర్మించిన రైతు వేదిక, కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లబ్దిదారులకు డబుల్‌బెడ్రూమ్ ఇళ్లను అందించారు. అక్కడ జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడతారు.
తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ పట్టణానికి చేరుకుంటారు. నిజయోకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిప్పాపురంలో 100 పడకల ఆస్పత్రి, హెల్త్ ప్రొఫైల్, సిటీ స్కాన్, ఆక్సిజన్ ట్యాంక్, పిడియాట్రిక్ వార్డ్, పీఎస్‌ఏ ప్లాంట్, పల్లీయేటివ్ కేర్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేములవాడలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.20 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో నాన్‌వెజ్, వెజ్ మార్కెట్ పనులకు శ్రీకారం చుడతారు. అక్కడి నుండి మర్రిపల్లి చేరుకుని కొత్తగా నిర్మించిన రైతువేదిక, కేజీవీ భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.