ఈసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాం: కేటీఆర్

ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని.. ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్‌ కీలక పాత్ర వహించనుందని కేటీఆర్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 11:38 AM GMT
Telangana, Minister KTR, Central Government, NDA,

ఈసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాం: కేటీఆర్

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. అంతేకాదు.. పలు పార్టీల అధినాయకులు, రాష్ట్రాల సీఎంలను కూడా కలిశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని జోస్యం చెప్పారు. అంతేకాదు.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్‌ కీలక పాత్ర వహించనుందని కూడా చెప్పారు మంత్రి కేటీఆర్.

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ఎన్నికల గురించి మాట్లాడారు. 75 ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని చెప్పారు. కొత్త మాగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు కూడా పెట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం 16వేలకు పైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతుందని చెప్పారు.

రూ.40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్‌ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టాటాలు మాత్రమే కాదు.. తాతలు మెచ్చిన కుల వృత్తులు ఉంటేనే అభివృద్ధి అని సీఎం కేసీఆర్ చెబుతారని అన్నారు. చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ.200 కోట్ల క్యాష్ క్రెడిట్‌ లిమిట్ అందిస్తామని చెప్పారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు అందిస్తామని.. ఈ పథకం ఆగస్టు, సెప్టెంబర్‌ నుంచి అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

చేనేత మీద జీఎస్టీ విధించిన ప్రధాని మోదీ.. వెనక్కి తీసుకోవాలని కోరితే ఇప్పటికీ స్పందించలేదని అన్నారు. చేనేత వద్దు అనేలానే కేంద్రం తీరు ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నేతన్నల గురించి ప్రధాని మోదీకి తెలియదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వీటన్నింటి ప్రభావం ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్.

Next Story